📱 మొబైల్ చాటింగ్ 📲
చాటింగ్ అంటే, మన వాడుక భాషలో “సోది కబుర్లు” అని చెప్పొచ్చేమో? చాటింగ్ చేసేవారికి ఇది నిజమే అనిపిస్తుంది గాని, నిజాన్ని మాత్రం ఒప్పుకోరనేది మాత్రం నిజం. ఎందుకు “సోది కబుర్లు” అన్నానంటే? ప్రతీ పది మెస్సేజెస్ లో మనకు ఉపయోగపడేది ఒక్కటే వుండొచ్చు. మిగిలినదంతా మున్సిపాలిటీ చెత్త. విస్తారమైన మాటలలో దోషముండక మానదు (సామె 10:19) అందుచే, మాటలాడుటకు నిదానించువాడునై యుండవలెను." (యాకోబు 1:19).
సాతాను స్మార్ట్ ఫోన్ మన చేతికిచ్చి, వాడు మాత్రం స్మార్ట్ గా వ్యవహరిస్తూ మనలను పిచ్చోళ్లను చేసి, గ్రాండ్ సక్సెస్ అంటూ గంతులు వేస్తున్నాడు.
మాట్లాడడం కంటే, చాట్ చెయ్యడం అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే? మాట్లాడేటప్పుడు మనసులోని కొన్ని భావాలను వ్యక్తీకరించడానికి యిబ్బందిగా అనిపిస్తుంది. వాటిని నేరుగా ఇతరులతో పంచుకోలేము. కానీ, చాటింగ్ అట్లా ఉండదు. మనసులో ఏదైతే వుందో ఆ భావాలను నిర్మోహమోటముగా టైప్ చేసే అవకాశం వుంది. అవి అనేక ప్రమాదకరమైన, అననుకూలమైన పరిస్థితులకు దారితీయవచ్చు కూడా.
లెక్కలేనన్ని చాటింగ్, డేటింగ్ వెబ్ సైట్స్ అందుబాటులోకి వచ్చేసాయి. కనీసం మొబైల్ లో బైబిల్ యాప్ ఓపెన్ చేసినాగాని, అవి ప్రత్యక్షమవుతున్నాయి.
నేటి యువత మార్ఫింగ్ ఫొటోస్ కి మోసపోయి, విచ్చలవిడిగా వారితో చాట్ చేసి, వారి రహస్య జీవితాన్ని వారితో పంచుకొని, చివరికి వారి నిజ స్వరూపం తెలుసుకొని, వారినుండి బయటపడలేక, వారు చేసే బ్లేక్ మెయిలింగ్ తట్టుకోలేక, ఎవ్వరితోనూ చెప్పుకోలేక జీవచ్ఛవాలలా బ్రతుకును నెట్టుకొస్తున్నవారెందరో? చదువుమీద ద్యాసలేదు. ఆధ్యాత్మికతను గురించి ఇక మాట్లాడాల్సిన పనిలేదు.
వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా అందుబాటులోనికి వచ్చిన తర్వాత మనుష్యులు మాట్లాడుకోవడమే తగ్గించేసారు. తిట్టుకున్నా, నవ్వుకున్నా అంతా చాటింగ్ లోనే.
భర్త ఆఫీస్ కెళ్ళి, ఇంటికొచ్చాక కొద్దిసేపు తన భార్యతో కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక్క విషయం కూడా వుండట్లేదు. కారణం? ఈమె ఇంట్లో నుండి ప్రతీ నిమిషం ఫ్లాష్ న్యూస్. సమస్యలు, వాటి పరిష్కారాలు అన్ని చాటింగ్ లోనే. ఇక సాయంకాలం మాట్లాడుకోవడానికి ఏముంటుంది? తద్వారా జీవితం యాంత్రికమవుతుంది.
పరిస్థితి ఎంత ఘోరంగా మారిందంటే, ప్రక్క రూమ్ లో నున్న భర్తను పిలవాలంటే, మెస్సేజ్ లేదా, మిస్సిడ్ కాల్ యిచ్చే పరిస్థితికి చేరింది. మనసువిప్పి కలసి మాట్లాడుకొనే పరిస్థితులు లోపించాయి. కంప్యూటర్ యుగంలో వున్నాము. టెక్నాలజీ ఉపయోగించడంలో ప్రావీణ్యం పొందామని సంబరపడుతున్నాము గాని, ప్రేమానురాగాలు దూరమవుతున్నాయనేది మాత్రం వాస్తవం.
భర్త ప్రక్కన వుండగానే, భార్య మరెవరితోనో చాటింగ్. భార్య ప్రక్కన వుండగానే భర్త మరెవరితోనో చాటింగ్. ఇట్లాంటి విషయాలతో గొడవలు పడేవారు కొందరైతే, ఒకరినొకరు ఏమి అనలేక, హృదయంలో చెప్పలేనంత, ఎవ్వరికి చెప్పుకోలేనంత భారం. అయినప్పటికీ ముఖానికి నవ్వు పులుముకొని, రాజీపడి జీవితాన్ని కొనసాగించేవారు కోకొల్లలు.
మన ప్రక్కనున్న వ్యక్తిని ప్రక్కనబెట్టి, ఎక్కడోవున్న వ్యక్తితో చాటింగ్ చేస్తున్నామంటే, ప్రక్కనున్న నీకంటే, ఎక్కడోనున్న వాడే నాకు ముఖ్యం అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాము. తద్వారా మన సంబంధాలను త్రెంచుకోవడానికి బాటలు వేస్తున్నాము.
చాటింగ్ గురించి నేను చెప్పినదానికంటే, మీకు తెలిసిందే చాలా చాలా ఎక్కువ. ఒక్కమాటలో చెప్పాలంటే? చాటింగ్ కోసం మీరు పడే తిప్పలు మీకంటే ఎక్కువ యింకెవ్వరి తెలియవు.
💮 మన చాటింగ్ గాని, మన మాటలు గాని ఏ రీతిగా వుండాలి?
👉 ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి. (కొలస్సి 4:6).
👉 వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి. (ఎఫెసి 4:29 )
👉 కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు." (ఎఫెసి 5:4)
మన మాటలు మనలను మనమే హెచ్చించుకొనే స్థితిలో వుంటాయి. వద్దు! తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు. ఆయనను హెచ్చించాలి. మనము తగ్గించబడాలి. "దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమిమీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను." (ప్రసంగి 5:2). దేవుని పిల్లలముగా మనమాటలు ఎట్లా వున్నాయి? మనలను తృణీకరింపచేసేవిగా ఉన్నాయా?లోకము నుండి ప్రత్యేక పరచబడిన మనము, 'మన మాటలు' గాని, మన చాటింగ్ గాని అనేకులకు మాదిరికరంగా ఉండాలి.
ఎవరితో మాట్లాడుతున్నామో, ఏమి మాట్లాడుతున్నామో? తద్వారా వాటివల్ల కలిగే పర్యవసానాలు? ఆ విషయాలను పరిగణలోనికి తీసుకొని, సరిచేసుకొని, సాగిపోవుదముు . ఈ రీతిగా మన జీవితములను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
THANK YOU FOR VISITING THIS BLOG
***************************************
* Follow the Page *
* *********
In This Blogger I Will Post
#Christain Song Lyrics
#Christain Ringtones (Mobile Ringtones)
#Songs Book PDF
So On.....!
For Above All Check In Menu Bar
*****************************************
0 Comments