Pʀᴀɪsᴇ Tʜᴇ Lᴏʀᴅ
అనేకులు ఈ దినం మానవ ప్రేమకు సంబంధించిన వాలెంటైన్స్ డే ను జరుపుకుంటారు. కాని అంతకంటే గొప్ప ప్రేమ, మరొక ఉన్నతమైన ప్రేమ ఉందని, ప్రేమ కోసం తపించిన పోతున్న సర్వమానవుల కోసం ప్రభువైన యేసు తన ప్రశస్తమైన ప్రేమ సందేశాన్ని వ్రాశాడని, అంతకంటే అధ్బుతమైన ప్రేమ ఈ లోకంలోనే లేదని గుర్తించ లేకపొతున్నారు.
అసలు *ప్రేమ యొక్క స్వరూపమే యేసు*
అని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని, దేవుడు ప్రేమయై యున్నాడని బైబిల్ గ్రంధం స్పష్టంగా చెప్పుచున్నది. ప్రేమ కోసం అర్రులు చాస్తున్న మానవుల కొరకు ఈ ఉన్నతమైన యేసు ప్రేమ బహుమానాన్ని గురించి ఒక చిన్న పరిశీలన చేద్దాం.
వెల్లడి పరచబడిన దేవుని ప్రేమ:* యేసు తన సిలువ రక్తం ద్వారా తన ప్రేమను వెల్లడి చేసినాడు. యేసు మరణం ప్రేమ యొక్క లోతును తెలియజేస్తుంది. ఒక వ్యక్తి ప్రేమ కోసం ఎంత దూరం వెళతాడు?
మంచివాళ్ళ కోసం మరణించటం స్నేహితుల కోసం మరణించడం మనం అక్కడక్కడ చూస్తాం. కాని చెడ్డవాళ్ల కోసం మరణించడం మనం ఎక్కడా చూడం. (రోమా 5:8 అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనమింక పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.)
క్రీస్తు ఈలోకంలో జన్మించి మన స్థానంలో మరణించి మన పాపాలను తొలగించి వేశాడు. క్రీస్తు సిలువదగ్గర వెల్లడి అయిన దేవుని ప్రేమ మనకు నేర్పుతున్నదేమిటంటే, మనము పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు.
దీనిని మనం నమ్మినప్పుడు మనలను నిర్దోషులుగా ఎంచి తన స్నేహితులుగా చేసుకుంటాడు. ఇది తిరుగులేని దేవుని ప్రేమ. రోమా 5:7-8 నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.
శాంతికరమైన యేసు ప్రేమ:* (1 యోహాను 4:10 మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు శాంతికరమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమ యున్నది.)
మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇదే రక్తంతో వ్రాయబడిన ప్రేమ.
యేసు ఈ లోకంలో జన్మించుటకు గల కారణం దేవుని ఉన్నతమైన ప్రేమ. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ దేవుని స్వభావం. ఆయన మనలను ప్రేమించకుండా ఉండలేడు. ప్రభువు తానే మానవ అవతారం ఎత్తి, ఈలోకంలోనికి తన రక్తం ద్వారా మానవులకు రక్షణ ప్రసాదించడమే మన యెడల ఆయనకున్న ప్రేమయే.
జీవింపజేయు యేసు ప్రేమ:* సర్వమానవులు సాతాను చేతిలో నశించి పోకుండా “జీవించునట్లు” దేవుని ప్రేమ యేసు ద్వార ప్రత్యక్ష పరచబడినది. (1 యోహాను 4:9 మనము ఆయన ద్వారా జీవించునట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.)
దేవుడు తనప్రేమను చూపుటకును తనతో సహవాసము కలిగి యుండుటకును మానవుని సృష్టించెను. దేవుడు మానవుని సృష్టించి నప్పుడు శరీరము మాత్రమే గాక, ప్రాణము, ఆత్మను కూడా యిచ్చెను. తన స్వరూపం, తన పోలిక, తన ఆత్మ ప్రభువు మనకిచ్చుట అనునది మానవుల యెడల ఆయన కున్న ప్రేమను తెలియజేయు చున్నది. ఆయన ఈలాగు సెలవిచ్చుచున్నాడు. "నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనై యుందును; మీరు నాకు ప్రజలై యుందురు" లేవి. కాం. 26:12.
అటువంటి ప్రియమైన మానవుడు పాపంలో పడిపోతే సాతానుచేతిలో నాశనం అవుతుంటే, సర్వ సృష్టిని ఒక్క నోటిమాట చేత సృజించిన దేవుడు ఒక్క నోటిమాట చేత ఈ లోకములోని పాపులందరిని రక్షించలేడా? అవసరమైతే తన వేవేల దూతలను పంపి పాపులందరిని రక్షించగలడు. అయితే దేవుడే స్వయంగా రక్షించుటకు ఎందుకు దిగి వచ్చాడు?
ప్రేమ యొక్క స్వరూపం యేసు:* యేసే స్వయంగా నశిస్తున్నవారిని రక్షించుటకు ప్రేమ స్వరూపంలో వచ్చాడు. 1 యోహాను 4:8 దేవుడు ప్రేమస్వరూపం గలవాడు.
ఒక రాజు తన కుమారునితో కలసి నదిలో ఓడ మీద షికారుకు వెళ్ళెనట. రాజకుమారుడు కాలుజారి నదిలో పడెనట. ఆ రాజకుమారుని రక్షించుటకు ఓడలో అనేకమంది పరివారమున్ననూ ఆగలేక ఆ రాజుగారే స్వయంగా నదిలోనికి దూకి తన కుమారుని రక్షించాడు. దీనికి కారణం తండ్రి ప్రేమ.
సర్వశక్తిగల దేవుడు ఒక్క మాటచేత ఈ పాపులందరినీ రక్షింప సమర్ధుడైయుండియూ అట్లు రక్షింపక తానే మానవ అవతారం ఎత్తి, ఈలోకంలోనికి స్వయంగా వచ్చి శిలువలో రక్తం ద్వారా రక్షిచుటకు కారణం, మానవుల యెడల ఆయనకున్న ఉన్నతమైన ప్రేమయే”
. శ్రేష్ఠమైన యేసు ప్రేమ:* మానవ హృదయంలో ప్రేమ అను భావం మొలకెత్తుటకు యేసు ప్రేమయే కారణం. యేసు మన కొరకు చూపిన ప్రేమ శ్రేష్టమైనది అని పౌలు చెప్పుచున్నాడు. అటువంటి దివ్య ప్రేమకు మూలాధారం యేసే, మానవుడు కాదు. ప్రేమను గురించి యేసు మనకు నేర్పించకపోతే అదేమిటో మనకు తెలియదు.
ఆయన మనల్ని ప్రేమించకపోతే, తన ప్రేమను మన హృదయాల్లో ఉంచకపోతే ప్రేమకు అర్ధం మనకు తెలియదు. (1 యోహాను 4:10 మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; *ఇందులో ప్రేమయున్నది.*)
తమకున్న జ్ఞానం, తెలివి విషయంలో మనుషులు గర్వపడవచ్చు. కానీ దేవుని ప్రేమ వారిలో లేకపోతే తమను తాము మోసగించుకొంటున్నారు. వారికి రకరకాల నిగూఢ అనుభవాలు, ఆత్మ తృప్తి కలిగించే ఉద్రేకాలు ఉండవచ్చు. కానీ అవి కూడా ప్రేమ చూపేలా చేయకపోతే అన్నీ వ్యర్థమే, నిరుపయోగమే. (1 యోహాను 4:16 మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగిన వారమై దాని నమ్ముకొని యున్నాము 1 యోహాను 4:19 ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. 1కొరి 13:13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; *వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే*.)
స్వార్ధం ఎరుగని ప్రేమ - ఆగాపే:* విశ్వాసులు దేవుని మూలంగా పుట్టారు కాబట్టి ప్రేమించడంలో దేవుని లాగానే వారుండాలి. ఇక్కడ యోహాను చెప్తున్నది దివ్య ప్రేమ అనగా స్వార్ధం ఎరుగని ప్రేమ.
(“ఆగాపే” – 1 కొరింతు 13:1 మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును )
ప్రేమలన్నిటికంటే ఒక ఉన్నత స్థాయి ప్రేమను ఈ పదం “ఆగాపే” తెలియజేస్తున్నది. ఇది దేవుని ప్రేమ, క్రీస్తులో నమ్మకం ఉంచిన వారికి ఆయన ఇచ్చే ప్రేమ (యోహాను 17:26 నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియ జేసెదనని చెప్పెను).
లోకంలో మరెవరిలోనూ ఇది లేదు. ఇతరుల మేలు కోరే ప్రేమ స్వార్థం లేని ప్రేమ. ఎప్పుడూ. కామం, స్వార్థపరమైన కోరికలు, స్త్రీ పురుష సంబంధాల్లో ఉండే ప్రేమతో దీనికి ఎలాంటి సంబంధమూ లేదు. లోకంలో మనుషులకు తమ స్నేహితులపట్ల, కుటుంబాలపట్ల ఉండే సహజ ప్రేమ కంటే మించినది ఇది. లైంగిక ప్రేమతో గానీ మోహంతో గానీ లోకమంతటా కనిపించే భావోద్రేక పూరితమైన ప్రేమతో గానీ దీనికి సంబంధమే లేదు. ఇది స్వార్థం లేని ప్రేమ. సేవ చేస్తూ, ఇతరులకు దీవెనలు తేవాలని చూచే ప్రేమ. ఇతరుల ఆధ్యాత్మిక మేలును ఆశించే ప్రేమ. మన కోసం చనిపోయేందుకు యేసు ఈ లోకంలోనికి రావడంలో ఇది చక్కగా కనిపించింది.
దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం కావాలి:* (1 యోహాను 4:11 ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనికొకడు ప్రేమింప బద్ధులమైయున్నాము.) అనగా మనము ఒకరి నొకరు ప్రేమించుకోవాలి. దేవుడు మనలను ప్రేమించి మన కొరకై ఈ లోకములో జన్మించిన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములకై సిలువలో చనిపోయి, పాతిపెట్టబడి, తిరిగిలేచెనని, మనము విశ్వసించి, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించిన యెడల నశింపక నిత్యజీవము పొందెదము (యోహాను 3:16).
దేవుడు మనలో ఉంటే ప్రేమ మనలో ఉంటుంది. ప్రేమ (ఆగాపే) మనలో ఉంటే దేవుడు మనలో ఉంటాడు. ఆయన గొప్ప ప్రేమ మనలో పరిపూర్ణం కావాలి అనగా దేవుని ప్రజలు ఒకరినొకరు ప్రేమించడం వల్లే దేవుని ప్రేమ ఈ భూమిపై నెరవేరుతుంది.
ముగింపు:* ప్రేమమూర్తియైన యేసు ఈ లోకంలోనికి వచ్చి తాన సిలువ రక్తం ద్వారా మనపట్ల తన ప్రేమను నిరూపించాడు. ఒక మనిషి ఆధ్యాత్మికంగా జన్మించిన తరువాత అతడు దేవుణ్ణి ఎరిగినవాడు అనడానికి ఉన్న ఖాయమైన రుజువు ఏమిటంటే అతని హృదయంలో దేవుని ప్రేమ ఉండడమే. కాబట్టి ఆ గొప్ప దేవుని బిడ్డలముగా మనం కూడా ప్రేమించాలి. ఆ గొప్ప ప్రేమను ఇతరులకు చూపాలి. అవసరమైతే ఇతరులపట్ల మన ప్రేమను మాటల్లో చేతల్లో అవసరమైన్తే రక్తంతో వెల్లడి చేయాలి.
అట్టి రక్తంతో వ్రాయబడిన గొప్ప ప్రేమను ప్రభువు మన హృదయంలో సమృద్ధిగా కుమ్మరించును గాక. ఆమెన్!
దైవాశ్శీసులు!!!
0 Comments